VGన్యుస్: రాబోయే ఏడాదిన్నర కాలంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్, అల్వాల్ టిమ్స్, ఎల్బీనగర్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లను వరుసగా ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ఏ కార్పొరేట్ ఆసుపత్రికి తీసిపోని విధంగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ సనత్ నగర్ లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Dr MCR TIMS) ను సీఎం ప్రారంభించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలు, అత్యాధునిక వైద్య పరికరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం ఆసుపత్రి ఆవరణలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్, వరంగల్ ఆసుపత్రిని అత్యంత ప్రాధాన్యతతో నిధులు కేటాయించి వేగంగా నిర్మాణాలు పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.ఈ ఆసుపత్రులన్నీ పూర్తయితే రాష్ట్రంలో 10 వేల పడకల ఆసుపత్రులు పేదలకు అందుబాటులోకి వస్తాయన్నారు. తద్వారా రాష్ట్రంలోని పేదలకు ఒక విశ్వాసాన్ని ఇవ్వగలుగుతామని చెప్పారు. ఎయిమ్స్‌తో పోటీపడే సేవలు అందిస్తున్న NIMS ఆసుపత్రికి ధీటుగా ఒక్కో ఆసుపత్రికి ఒక్కో డైరెక్టర్‌ను నియమించి వారి పర్యవేక్షణలో వీటిని తీర్చిదిద్దుతాం. అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయడమే కాకుండా నిర్వహణలో ఏ కార్పొరేట్ ఆసుపత్రి తీసిపోని విధంగా నిర్వహిస్తామన్నారు. అందుకు ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగంలో ఇప్పటి వరకు 16 వేల మంది సిబ్బందిని నియమించాం.. గతంలో ఎప్పుడూ ఇంత పెద్దఎత్తున నియామకాలు చేపట్టలేదన్నారు. నర్సింగ్‌లో ఉన్న మహిళలు ఇప్పటివరకు మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే సేవలు అందిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో జర్మన్, జపనీస్, కొరియన్ భాషలను నేర్చుకుని ఆయా దేశాల్లో లక్షలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు.
32 నెలల ప్రజా పాలనలో రాజీవ్ ఆరోగ్య శ్రీ కోసం దాదాపుగా రూ. 2,700 కోట్లు ఖర్చు పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి రూ. 2,526 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. ఈ రెండు పథకాల ద్వారా వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో రూ. 5,226 కోట్లు ఖర్చు చేశాం.. దేశంలో పేదల కోసం ఈ స్థాయిలో నిధులను ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్యులు అదనపు సమయం, సేవలు అందించాలిని ముఖ్యమంత్రి సూచించారు. వైద్యులు వారి నైపుణ్యాన్ని ఇతర ప్రదేశాల్లో ఉపయోగించే పరిస్థితి కాకుండా సర్జరీలు నిర్వహించినప్పుడు, ఇతరత్రా వారికి ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌లు ఇస్తామన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి సూచించారు.







