Home తాజా వార్తలు గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది: సీఎం

గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది: సీఎం

VGన్యూస్: రాష్ట్రంలో గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ట్యాంక్‌బండ్‌ పైన ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం వారి చిత్రానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. అర్హులైన నేత, గీత కార్మికులు ఎంతమంది ఉన్నా అందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాను అని గుర్తుచేశారు. గౌడ సోదరులకు 50 వేల కాటమయ్య కిట్లను పంపిణీ చేశాం. ప్రమాదవశాత్తు గౌడ సోదరులు చనిపోతే 5 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తున్నాం” అని చెప్పారు.
గీత కార్మికుల వృత్తిని కాపాడటానికి నీటి పారుదల ప్రాజెక్టుల కాలువల గట్లపైన ఈత, తాటి చెట్లను నాటాలన్నారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు.సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తి ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో ట్యాంక్ బండ్ మీద ఉన్న పర్యాటక శాఖ కార్యాలయాన్ని మరోచోటికి తరలించి ఆ స్థలంలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. హైదరాబాద్ సందర్శనకు వచ్చే పర్యాటకులు, గణేష్ నిమజ్జన సమయంలో ట్యాంక్ బండ్ నుంచి ఎవరు వెళ్లినా ఒక స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కులవృత్తిని కొనసాగించండి. గౌరవించండి. కానీ పిల్లలను మాత్రం చదివించండి. పిల్లల తలరాతలను మార్చే శక్తి మన చేతుల్లో ఉంది. పిల్లలను చదివించి వారు ఉన్నతస్థానానికి చేరుకుని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలి అని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం పనిచేస్తుందన్నారు. సామాజిక న్యాయం కోసం రాష్ట్రంలో బీసీ కులగణన చేశాం. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేశాం. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

అధికారికంగా పండుగ సాయన్న జయంతి :
దొరలు, భూస్వాములు, పెత్తందార్లపై పోరాటం సాగించిన యోధుడు, ముదిరాజ్‌ల ఆరాధ్యదైవం పండుగ సాయన్న అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పండుగ సాయన్న పోరాటం, పౌరుషం పాలమూరు జిల్లాలో అందరికీ తెలుసన్నారు. అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.