Home తాజా వార్తలు గచ్చిబౌలి హాకీ స్టేడియానికి అరుదైన గుర్తింపు

గచ్చిబౌలి హాకీ స్టేడియానికి అరుదైన గుర్తింపు

VGన్యూస్: గచ్చిబౌలి హాకీ కాంప్లెక్స్ స్టేడియానికి అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) ప్రతిష్ఠాత్మక కేటగిరీ–1 హాకీ ఫీల్డ్ ధ్రువీకరణ లభించింది. ఈ ధృవీకరణతో దేశంలోనే మొట్టమొదటి మరియు ఒకే ఒక్క క్యాటగిరి 1 ఆస్ట్రేటర్ఫ్ హాకీ మైదానంగా గచ్చిబౌలి హాకీ స్టేడియం నిలిచింది. అత్యున్నత స్థాయి అంతర్జాతీయ, ఫీల్డ్ పరీక్షల్లో మైదానం నాణ్యత, బంతి కదలిక, ఉపరితల సమతుల్యత, మైదానం కొలతలు, లైన్ మార్కింగ్‌లు, నీటి పారుదల, ఆటగాళ్ల భద్రత, హాకీ గోల్స్, జట్లు–అధికారుల సదుపాయాలు, పరిధి కంచె, ప్రేక్షకుల వసతులు, అంతర్జాతీయ పోటీల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఎఫ్‌ఐహెచ్ పరిశీలించింది. ఇవన్నీ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు ధ్రువీకరించింది.
అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లకు అత్యంత కీలకమైన ఫీల్డ్ లైటింగ్‌ను కూడా ఎఫ్‌ఐహెచ్(International Hockey Federation) ప్రత్యేకంగా పరీక్షించింది. కేటగిరీ–1 మైదానానికి అవసరమైన TV3 స్థాయి లైటింగ్ ప్రమాణాలను గచ్చిబౌలి స్టేడియం అందుకుంటున్నట్లు నిర్ధారించింది. ఈ ధ్రువీకరణ 2029 ఫిబ్రవరి 26 వరకు అమల్లో ఉంటుంది. దీంతో గచ్చిబౌలి హాకీ స్టేడియం అంతర్జాతీయ స్థాయి హాకీ పోటీల నిర్వహణకు మరో కీలక గుర్తింపు పొందింది. ఇటీవల మార్చి 8 నుంచి 13 వరకు గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ మహిళల హాకీ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల నేపథ్యంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు సమన్వయంతో నిరంతరం కృషి చేసి, రికార్డు సమయంలో మైదానాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఈ కృషికి లభించిన ఎఫ్‌ఐహెచ్ కేటగిరీ–1 ధ్రువీకరణ గచ్చిబౌలి స్టేడియం సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసింది.