బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు జరిగే పోరాటానికి ముందుండి నాయకత్వం వహిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్రంలోని బీసీ సంఘాలు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా, నిబద్ధతతో నిర్వహించిన కుల సర్వేను తప్పుబడితే బీసీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విడమరిచి చెప్పారు. బలహీన వర్గాలు తమ హక్కుల సాధన కోసం చేసే పోరాటానికి పూర్తి మద్దతుగా నిలబడుతా అని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు, ప్రముఖులు, మేధావులు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు