VGన్యూస్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలోని ఆపార్టీ ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై సీపీఎం నేతలు కార్మికుల పక్షాన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని సీపీఎం నేతలకు తెలిపారు. మద్దతు ధరలు ప్రకటించడమే తప్ప కేంద్రం రాష్ట్రంలోని పంటను కనీసం 30 శాతం కూడా సేకరించడం లేదని వివరించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కారణంగా హామాలీలు తరలివెళ్లడంతో ఇక్కడ కొంత హామాలీల కొరత ఏర్పడిందన్నారు. అలాగే ఎండల కారణంగా మధ్యాహ్నం సమయంలో పని జరగడం లేదని తెలిపారు. సన్నవడ్లకు రూ. 500 బోనస్, మొక్కజొన్నను మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లపై నిరంతరం సమీక్ష చేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి సీపీఎం నేతలకు తెలిపారు.
మూసీ నిర్వాసితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్థానికంగానే నివాసాలు మంజూరు చేస్తామన్నారు. ఈ విషయంలో పార్టీలు రాజకీయం చేయడం తగదన్నారు. మూసీ పునరుజ్జీవం చేసి అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో చేపడుతున్న కార్యక్రమాలను వారికి వివరించారు. ఆరుట్ల పాఠశాలను ఒకసారి సందర్శించాలని సీపీఎం నాయకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పి.సుదర్శన్, జ్యోతి, నున్నా నాగేశ్వరరావు, మల్లు లక్ష్మి, సామినేని స్వరాజ్యం, ఎం. గోపాలరావుతో పాటు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.







