VGన్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడి, నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను తొలగించడం సరైంది కాదన్నారు బీఆర్ఎన్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. శుక్రవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రాణహాని ముప్పు ఉన్న ప్రతి వ్యక్తికి భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. ప్రజా జీవితంలోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు భద్రతను పెంచాల్సింది పోయి, పూర్తిగా తొలగించడం ఆందోళన కలిగించే విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణహాని ముప్పు ఉన్న వ్యక్తుల భద్రతను ఇష్టానుసారంగా తొలగిస్తే న్యాయస్థానాలు కూడా సమర్థించవు అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 శాతం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకుల భద్రతను కూడా ఇదే విధంగా తొలగిస్తే, ప్రజల్లో తిరగలేని పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.







