VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (జూన్ 2) పర్వదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలకు హృదయపూర్వక ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను కేసీఆర్ స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.
తెలంగాణ ప్రజల మీద దశాబ్దాల పాటు సాగిన అణచివేతపై పోరాడి, అనేక ఆవాంతరాలను అధిగమించి, శాంతియుతమైన పార్లమెంటరీ పంథాలో, ప్రజాస్వామ్య యుతంగా కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి పాలనలో తీవ్ర వివక్షకు గురై, దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలంగాణను స్వయం పాలనలో ఒక దిక్సూచిలా మార్చుకున్నామన్నారు. పరిపాలన చేతగాదు అని విమర్శించిన నోళ్లు మూతపడేలా ప్రగతి పాలనను అందించామని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రగతికి చిరునామాగా మారిన తెలంగాణ అస్తిత్వం తిరిగి మరోసారి ప్రమాదంలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సమాజాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం నిరంతరం ప్రగతి పథంలో దూసుకుపోవాలని, పచ్చని పాడి పంటలతో వర్ధిల్లాలని కేసీఆర్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆకాంక్షించారు.







