VGన్యూస్: ఉద్యోగుల్లో విశ్వాసం, నమ్మకం కలిగించడమే కాకుండా వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించామని చెప్పారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ ఉద్యోగుల బీమా రక్షణ కల్పించడానికి సంబంధించి వివిధ బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలు చేసుకుంది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వమంటే ఒక నమ్మకం. ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వర్తించడమంటే సంపూర్ణమైన భద్రత. సింగరేణి కార్మికులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కోటి రూపాయల బీమా కల్పించేందుకు ఉప ముఖ్యమంత్రి ప్రతిపాదించినప్పుడు నమ్మకం కుదరలేదు. కానీ సాధ్యమని నిరూపించారు. సింగరేణిలో సాధ్యమైనప్పుడు రాష్ట్రంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగులకు బీమా సౌకర్యం కల్పించడం ఎందుకు సాధ్యం కాదు. అందుకే అడక్కపోయినా ప్రభుత్వం బాధ్యతతో ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో లావాదేవీలు నిర్వహిస్తున్న 16 బ్యాంకులను ఆహ్వానించి ఉద్యోగుల సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నామన్నారు.
ప్రభుత్వ ఇమేజీని పెంచడంలో ఉద్యోగులే బ్రాండ్ అంబాసిడర్లు. ఉద్యోగులు ఆత్మగౌరవంతో నిలబడాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచన తప్ప మరొకటి లేదన్నారు. రోజుకు ఒక గంట ఎక్కువగా పనిచేయండని సూచించారు. పన్నులు కట్టకుండా ఎగ్గొడుతున్న వారిని పట్టుకునే బాధ్యత ఉద్యోగులదేనని స్పష్టం చేశారు. అక్రమార్కులను కట్టడి చేస్తే ఆదాయం పెరుగుతుందని తెలిపారు. ఆ ఆదాయాన్ని ఉద్యోగుల అవసరాలకే ఉపయోగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







