VGన్యూస్: వరదల కట్టడితో పాటు.. భూగర్భ జలాలను పెంపొందించాలనే లక్ష్యంతో చేపట్టిన చెరువుల పునరుద్ధరణలో మరో 4 చెరువుల పనులకు హైడ్రా గురువారం శ్రీకారం చుట్టింది. ఐటీ కారిడార్‌కు చేరువలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఇబ్రహీంబాగ్ లోని ఇబ్రహీం పెద్ద చెరువు, గండిపేట మండలం పుప్పాలగూడలోని భగీరథమ్మ చెరువు, కూకట్పల్లి మండలం మూసాపేటలోని కాముని చెరువుతో పాటు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కాప్రాలోని కాప్రా చెరువు పునరుద్ధరణ పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రారంభించారు.
ఇబ్రహీం చెరువుతో పాటు.. కాముని చెరువుల వద్ద హైడ్రా కమిషనర్ భూమి పూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. కాముని చెరువును 48 ఎకరాలు, ఇబ్రహీం పెద్దచెరువు 97 ఎకరాలు, 54 ఎకరాల్లో భగీరథమ్మ చెరువు, 112 ఎకరాల్లో కాప్రా చెరువును అభివృద్ధి చేస్తున్నారు. ఈ నాలుగు చెరువుల పునరుద్ధరణకు రూ. 107 కోట్లు వెచ్చిస్తున్నారు.







