VGన్యూస్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చేస్తున్న అన్యాయం ప్రతి ఒక్కరికీ అర్థమైందన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మహబూబ్‌నగర్ ప్రజలు సంపూర్ణంగా తిరస్కరిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. ఆదివారం కేటీఆర్.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దాదాపుగా పూర్తయిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టి, కమిషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం లక్షల ఎకరాల పంటలకు నీరందకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం ప్రతి ఒక్కరికీ అర్థమైందన్నారు. మహబూబ్‌నగర్ బిడ్డనని పదేపదే చెప్పుకుంటూ జిల్లా ప్రజలను మోసం చేస్తూ, అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధికి ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డికి గతంలో మాదిరిగానే మరోసారి కొడంగల్ ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెబుతారన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణ ఏర్పాటుకు ముందు వలసల జిల్లాగా, కరువు జిల్లాగా ఉండేదన్నారు. అలాంటి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపి కరువును, వలసలను తరిమికొట్టిన ఘనత ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని కేటీఆర్ గుర్తు చేశారు. ఇంత గొప్పగా జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంలో గత ఎన్నికల్లో పార్టీ విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఒకవైపు ప్రజల్లోకి తీసుకెళ్తూనే, గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని మరోసారి ప్రజలకు గుర్తుచేయాలని కేటీఆర్ సూచించారు.
కేటీఆర్ పార్టీ నేతలకు రానున్న ఎన్నికలు, పార్టీ బలోపేతానికి సంబంధించిన పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అలాగే త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం, పార్టీ చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై నియోజకవర్గాల వారీగా చర్చించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సి. లక్ష్మా రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామ్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే విజేయుడు, మాజీ ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.







