VGన్యూస్: వర్షాకాల సీజన్‌లో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు. అలసత్వంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో విపత్తుల సన్నద్ధత, వ్యవసాయ కార్యచరణ పై వివిధ విభాగాధిపతులతో MCRHRD లోని బోధి పెవిలియన్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వర్షాలు కురిసిన సమయంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణ విషయంలో తలెత్తుతున్న లోపాలపై సంబంధిత శాఖలకు దిశానిర్ధేశం చేశారు. ఇటీవల వర్షం కారణంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడిన విషయంలో శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించిన విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్ లో మానవ తప్పిదం వల్ల ఇలాంటి సమస్య ఉత్పన్నమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
వర్షపు నీరు నిల్వ ఉంటున్న ప్రాంతాలను గుర్తించి, త్వరగా ఆ నీళ్లు తొలగించేలా కార్యచరణ ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించబోనన్నారు. నిబంధనల ప్రకారం నిర్వహణ చేపట్టాలని, అవసరమైన నిధులు తక్షణం విడుదల చేస్తామని స్పష్టం చేశారు. రైతు వేదికలను యూరియా పంపిణీ కేంద్రాలుగా వినియోగించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.







