VGన్యూస్: హైదరాబాద్‌లో జరుగుతున్న గ్రీన్ గ్రోత్ ఎకనమిక్ సమ్మిట్ -2026లో పాల్గొనడానికి వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. బుధవారం ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో మలేషియా పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ ఎం. శరవణన్, అమెరికాకు చెందిన బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ బోర్డు డైరెక్టర్ నిలి గిల్బర్ట్, అమెరికా వాణిజ్య శాఖ మూమెంటమ్ టెక్నాలజీస్ అడ్వైజరీ కమిటీ సభ్యులు మహేష్ కొండూరు, ఓక్సన్ టెక్నాలజీస్, గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ కో-చైర్ అమిత్ మెహ్రా, నార్వే ప్రభుత్వ మాజీ స్టేట్ సెక్రెటరీ, ఓషన్ హౌస్ గ్లోబల్ స్ట్రాటజీస్ సలహాదారు దిలెక్ అయహన్, దక్షిణాఫ్రికా పార్లమెంట్ సభ్యుడు థామస్ ప్రోలిక్, సిలోన్ వర్కర్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు సెంథిల్ తొండమాన్ సీఎంతో భేటీ అయ్యారు.
ఈ ప్రతినిధి బృందంతో జరిగిన భేటీలో ప్రధానంగా పర్యావరణం, సామాజిక, పరిపాలనా పరమైన అంశాలతో పాటు మౌలిక సదుపాయాలు, ఏఐ వినియోగం, భవిష్యత్తు పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. అలాగే తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు. ఈ సమావేశంలో గ్రీన్ గ్రోత్ ఎకనమిక్ సమ్మిట్ నిర్వహిస్తున్న మెరీడియన్ కలెక్టివ్ ప్రతినిధులు రిత్వికా భట్టాచార్య, ఉమా భట్టాచార్య, లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.







