VGన్యూస్: గ్రామాల అభివృద్ధి అంటే కేవలం భవనాలు, రోడ్లు నిర్మించడం మాత్రమే కాదని, గ్రామాల్లో నివసించే ప్రతి కుటుంబ జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే అసలు అభివృద్ధి అని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గ్రామాలను స్వయం సమృద్ధిగా, నగరాలకు తీసిపోని మౌలిక వసతులతో తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో మంగళవారం గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు ఏడు గంటల పాటు సాగిన సమావేశంలో శాఖల వారీగా పనుల పురోగతి, భవిషత్తు లక్ష్యాలను మంత్రి సీతక్క సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రెండు శాఖల పరిధిలో సుమారు 1.35 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారని, ఏటా రూ.34 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చవుతున్నాయని గుర్తుచేశారు. ఇంత భారీ యంత్రాంగం, నిధులు ఉన్నప్పటికీ గ్రామాల రూపురేఖలు ఆశించిన స్థాయిలో మారకపోవడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు ఒకే టీమ్‌గా పనిచేయాలన్నారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. గ్రామాలకు వచ్చే ప్రతి రూపాయి ప్రజల ప్రయోజనాలకే ఖర్చు కావాలని స్పష్టం చేశారు.
కొన్నిచోట్ల గ్రామసభలు నిర్వహించకుండా నిధులు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం, బాధ్యతారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంటకుంట, ప్రతి ఊరిలో ఊటకుంట ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు.







