Home జాతీయం & అంతర్జాతీయం ప్లాస్టిక్ రహిత పుష్కరాలను నిర్వహిద్దాం: ఉపముఖ్యమంత్రి

ప్లాస్టిక్ రహిత పుష్కరాలను నిర్వహిద్దాం: ఉపముఖ్యమంత్రి

VGన్యూస్: జీవ నదులను కాపాడుకోవడానికి విప్లవాత్మక నిర్ణయాలు అవసరమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై వివిధ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిoచారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నిర్వహించనున్నగోదావరి పుష్కరాలను దేశం మొత్తం మన వైపు తిరిగి చూసేలా, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా అరికట్టాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవనదులను ఎంత పవిత్రంగా, పర్యావరణ హితంగా కాపాడుకుంటుందో దేశం మొత్తానికి తెలియాలని పేర్కొన్నారు.

ఒక్క రాజమండ్రిలోనే కాకుండా గోదావరి ప్రవహించే ఆరు జిల్లాలలో ఏడాదిపాటు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పుష్కరాల నాటికి నదీ తీరాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అన్నదే కనిపించకూడదని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ఎన్విరాన్‌మెంటల్ టాస్క్‌ఫోర్స్ రాబోయే ఏడాది కాలంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలించేలా, దానికి తగిన ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తెచ్చేలా కఠినమైన చర్యలు చేపట్టాలన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ద్వారా రూ.100 కోట్ల ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయిస్తున్నామని తెలిపారు. గత పుష్కరాలకు 4.6 కోట్ల మంది భక్తులు వస్తే, ఈసారి ఆ రద్దీ రెట్టింపై దాదాపు 10 కోట్ల మంది వస్తారని అంచనా ఉంది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.