VGన్యూస్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌నబీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్‌నబీన్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించారు. 1997 కాకినాడ తీర్మానంతోనే ప్రత్యేక తెలంగాణకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించి, తన నిబద్ధతను చాటుకుందన్నారు. ఆనాడు పార్లమెంట్‌లో తెలంగాణ ప్రజల గొంతుకగా మారి సుష్మా స్వరాజ్ ఇచ్చిన భరోసా ఎప్పటికీ మరువలేనిదని గుర్తు చేశారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. గత 12 ఏళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పీఎం కిసాన్, ముద్రా రుణాలు, జాతీయ రహదారుల నిర్మాణం, బీబీనగర్ లో ఎయిమ్స్ స్థాపన, రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ వంటి ఎన్నో పథకాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ రోజు తెలంగాణ నుండి 5 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. కానీ, 2047 నాటికి ‘వికసిత భారత్’ సాధించాలంటే తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలన్నారు. కొందరు తెలంగాణను ఏటీఎంలా వాడుకుంటూ, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కలలను నిజం చేస్తూ, అవినీతి రహిత, సమృద్ధ తెలంగాణను నిర్మించడమే తమ సంకల్పమని నితిన్ నబీన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు,ఎంపీ రఘునందన్ రావుతోపాటు పలువురు భాజపా నాయకులు పాల్గొన్నారు.










