VGన్యూస్: సమాజంలో అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం, అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేయడమే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శనివారం అల్లూరి సీతారామరాజు 129వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. కేవలం 27 ఏళ్ల ప్రాయంలోనే దేశ స్వాతంత్య్రం కోసం, గిరిజనుల హక్కుల కోసం అల్లూరి చేసిన త్యాగం అనిర్వచనీయమని కొనియాడారు. ప్రజల కోసం, ప్రజల ద్వారా, ప్రజల కోసమే సాగిన ఆయన విప్లవ పోరాటం నేటి తరానికి నిరంతర స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అల్లూరి కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదని, స్వేచ్ఛాకాంక్ష గల ప్రతి భారతీయుడి గుండెల్లో కొలువై ఉన్న ఒక గొప్ప శక్తి అని ఆయన అభివర్ణించారు. జయంతి వేడుకల్లో భాగంగా, క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో సమకూర్చిన అంబులెన్స్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ అధికారులకు అందజేశారు. పోలీసుల విధి నిర్వహణలో, ముఖ్యంగా అత్యవసర సమయాల్లో ఈ అంబులెన్స్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.










