Home జాతీయం & అంతర్జాతీయం కులాలకు అతీతంగా వినిపించే గళం ‘సేనా గళం’: పవన్ కళ్యాణ్

కులాలకు అతీతంగా వినిపించే గళం ‘సేనా గళం’: పవన్ కళ్యాణ్

VGన్యూస్: సమాజంలో ఏదైనా తప్పు జరిగితే, అది చేసిన వ్యక్తిని మాత్రమే దోషిగా భావించాలని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అతని కులానికి, ప్రాంతానికి ఆపాదించకూడదని తెలిపారు. బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు. అనంతరం 58 అడుగుల అమరజీవి భారీ కాంస్య విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో కుల దూషణలు, విద్వేషాలు బాగా ఎక్కువయ్యాయి అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ సమయంలో ఇవి తారస్థాయికి చేరుకున్నాయని తెలిపారు. ఒక వ్యక్తి చేసే తప్పునుగానీ, నేరాన్నిగానీ మొత్తం కులానికి ఆపాదించి, అందరి మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం అధికం అయిందన్నారు. దీనివల్ల ప్రజలు మధ్య విద్వేషాలు, వైషమ్యాలు ఎక్కువ అవుతున్నాయి. ఇదే పద్ధతి కొనసాగితే సమాజం విచ్ఛిన్నం ఖాయమని స్పష్టం చేశారు. దీనికి ఎక్కడో దగ్గర చెక్ పెట్టాలనే ఉన్నతమైన ఆలోచనతో జనసేన పార్టీ సేనా గళం పేరుతో అన్ని సామాజిక వర్గాల ప్రతినిధులతో ఓ ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ సేనా గళం కులాలకు, ప్రాంతాలకి అతీతంగా ఎవరు తప్పు చేసినా ఎత్తి చూపుతుందన్నారు. ఒక కులానికి సంబంధించిన వారు తప్పు చేస్తే అదే కులం వారితో తిట్టించడం, నిందించడం లాంటివి ఉండవని చెప్పారు. కులాలకు అతీతంగా సమష్టిగా సేనా గళం తప్పును ఎండగడుతుందనీ, వాస్తవాన్ని తెలియచేస్తుందని స్పష్టం చేశారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నట్లు కుల నిర్మూలన జరుగుతుందో లేదో తెలియదుకానీ… ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల మధ్య పరస్పర సహకారం చాలా అవసరమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ముందు మనం కులాలను వదిలి తప్పును తప్పుగా చూసి, దాన్ని అర్ధం చేసుకునే చైతన్యం రావాలన్నారు. తెలంగాణలో ప్రజలందరినీ కలిపి ఉంచే ఒక బలమైన భావోద్వేగం, తెలంగాణ అనే నినాదం ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో నా ఆంధ్ర అనే ఒక భావన సరిగ్గా లేదన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి అసలైన గుర్తింపును, ఉనికిని ఇచ్చిన పొట్టి శ్రీరాములు లాంటి గొప్ప మహానుభావుడిని కూడా మనవాళ్లు కేవలం ఒకే ఒక కులానికి పరిమితం చేసి చూస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన త్యాగం అమూల్యమని తెలిపారు. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం వల్లే స్వతంత్ర భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు జరిగిందన్నారు. ఈ విషయాలను కులాలు దాటి ఆలోచించాలని తెలిపారు.