Home తాజా వార్తలు సాగునీటి ప్రాజెక్టుల పనులను తొందరగా పూర్తిచేయాలి: సీఎం

సాగునీటి ప్రాజెక్టుల పనులను తొందరగా పూర్తిచేయాలి: సీఎం

VGన్యూస్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పనులను వీలైనంత తొందరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాజెక్టుల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడంలో భూసేకరణకు మొదట ప్రాధాన్యతగా తీసుకోవాలని ఆదేశించారు. భూ సేకరణ పూర్తి చేయకుండా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగవని అన్నారు. భూ సేకరణ పూర్తి చేసే విషయంలో సంబంధిత జిల్లాల కలెక్టర్లు స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను సమీక్షిస్తూ భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణకు సంబంధించి అవసరమైన నిధులు ఎప్పటికప్పుడు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.