VGన్యూస్: వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యార్థుల అల్పాహారం & పాలు పథకాన్ని రాజ్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే విద్యలో రాణించగలరనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం – పాలు పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడుతున్నామని తెలిపారు. అల్పాహారం – పాలు పథకం అమలుకు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల సహకారంతో దాదాపు రూ.800 కోట్లు వ్యయం చేస్తోందని తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ తరగతులు కూడా ప్రారంభిస్తున్నామని, చిన్నారులు పాఠశాలలోనే అల్పాహారం తీసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు.
విద్యార్థులు ప్రతిరోజూ సమయానికి పాఠశాలకు హాజరై అల్పాహారం, మధ్యాహ్న భోజనం తీసుకుంటూ విద్యలో రాణించాలని సూచించారు. తల్లిదండ్రులు పడుతున్న కష్టానికి ప్రతిఫలంగా మరింత కష్టపడి చదివి మంచి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. . విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమ అనంతరం విద్యార్థులకు పుస్తకాలు మరియు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్ , యశస్వినీ రెడ్డి , కలెక్టర్ ప్రియాంక ఆలా ,డీఈవో యాదయ్య, మన్నా ట్రస్ట్ సీఈవో లీనా జోసెఫ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.







