VGన్యూస్: విద్యార్థినీ విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసి వారిని సమాజంలో గొప్ప పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా, స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు కిట్స్ పంపిణీతో పాటు విద్యా రంగానికి సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “విద్యార్థులు బాగా బాగా చదువుకోవాలి. చదువుకోవడానికి ఏం కావాలో సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటా. పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్ కాకుండా భవిష్యత్తులో రవాణా సౌకర్యం కల్పించాలని ఆలోచన చేస్తున్నాం. రాష్ట్రంలో 27.50 లక్షల మంది విద్యార్థులకు యంగ్ ఇండియా స్టూడెంట్స్ కిట్స్ అందిస్తున్నాం.” అని అన్నారు.
విద్యా రంగాన్ని వికాసంవైపు నడిపించాలన్న లక్ష్యంతో బడ్జెట్‌లో ఆ రంగానికి రూ. 26,600 కోట్లు (8.5 శాతం) నిధులు కేటాయించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీన్ని ప్రభుత్వం ఖర్చుగా కాకుండా భవిష్యత్తుకు పెట్టుబడిగా భావిస్తోందని తెలిపారు. అత్యంత నిరుపేద తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంగ్లీషులో చదువుకోవాలని, భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. వారి కోసం ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ప్రారంభించామని చెప్పారు.
ఎవరేమనుకున్నా నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు ఒక స్పష్టమైన విధానం ఉండాలని విద్యా పాలసీని తెచ్చామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. విద్యా రంగంలో తెలంగాణను దేశానికి రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఆరుట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ మోడల్ స్కూల్ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ అని బోర్డు పెట్టే పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఉపాధ్యాయులు ఎంతో శ్రమించి పనిచేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక పబ్లిక్ స్కూల్ అందిస్తున్నామని చెప్పారు. చదువులో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాన్ని, ప్రశంసా పత్రాలను అందజేశారు. గవర్నర్ కలిసి ముఖ్యమంత్రి “అన్న- అక్క మెంటార్షిప్” కార్యక్రమాన్ని ఆవిష్కరించారు.







