Home తాజా వార్తలు ఈ నెల 28న పల్స్ పోలియో.. ఏర్పాట్లపై ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష

ఈ నెల 28న పల్స్ పోలియో.. ఏర్పాట్లపై ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష

VGన్యూస్: రాష్ట్రంలోని 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం జూబ్లిహిల్స్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జూన్ 28న రాష్ట్రవ్యాప్తంగా పోలియో బూత్‌లలో డ్రాప్స్ వేయనున్నట్లు, జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి మిగిలిపోయిన చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేసేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా బూత్‌లు, మొబైల్ బృందాలు, ఇంటింటి సర్వేల ద్వారా పోలియో డ్రాప్స్ అందించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు విస్తృతంగా ఉండటంతో జూలై 1న అదనంగా మరో రోజు కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రవ్యాప్తంగా 22,979 పోలియో బూత్‌లు, 903 మొబైల్ బృందాలు, 903 ట్రాన్సిట్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు మంత్రికి అధికారులు తెలిపారు.