VGన్యూస్: రాష్ట్ర బడ్జెట్‌కు అనుగుణంగా లక్ష్యాలను సాధించడానికి ఆదాయ సమీకరణపై కచ్చితంగా దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లీకేజీలను అరికట్టి ఆదాయ సమీకరణకు సంబంధించి చేజింగ్ సెల్‌ను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ సమీకరణపై ముఖ్యమంత్రి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆదాయ పెంపు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక ఆదేశాలిచ్చారు. హెచ్ఎండీఏ, టీజీఐఐసీ ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.
వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్‌తో పాటు ఇతర శాఖలకు సంబంధించి లీకేజీలను పూర్తిగా అరికట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో నిర్లక్ష్యం వీడాల్సిందేనని అధికారులకు స్పష్టం చేశారు. అనుకున్న స్థాయిలో పనిచేయాలంటే శాఖలవారీగా సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను, ఇతర పనులను పూర్తి చేసేందుకు అనుగుణంగా శాఖలవారిగా బడ్జెట్‌ను తయారు చేసుకోవాలని చెప్పారు. ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా భూసేకరణను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించే బడ్జెట్ ఊహాజనితం కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. వాస్తవికత ఆధారంగానే బడ్జెట్ రూపకల్పన జరగాలని స్పష్టం చేశారు. ఆయా శాఖలకు అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సలహాదారు కె.రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







