Home తాజా వార్తలు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రులు పొన్నం, అజహరుద్దీన్

ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రులు పొన్నం, అజహరుద్దీన్

VGన్యూస్: అర్హత గల పేద నిరుపేద కుటుంబాలకు గౌరవప్రదమైన శాశ్వత నివాసాన్ని కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో వివిధ వృత్తుల్లో ఉపాధి చేసుకుంటున్నా పేదలకు అదే ప్రాంతంలో ఇళ్లు నిర్మించి అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ తో కలిసి లబ్ధిదారులకు 2 బీహెచ్‌కే గృహాల పట్టాలు అందచేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత పదేళ్లుగా గృహాల కోసం ఎదురుచూసిన లబ్ధిదారులు పడిన ఇబ్బందులను ప్రభుత్వం గుర్తిస్తోందని, ఆ జాప్యానికి ప్రభుత్వ ప్రతినిధిగా విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఇకపై అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలులో ఇటువంటి ఆలస్యం జరగకుండా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. గృహాలు పొందుతున్న ప్రతి కుటుంబానికి అభినందనలు తెలియజేశారు. ఇది ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేద కుటుంబాల కల సాకారమైన చారిత్రక సందర్భంగా అభివర్ణించారు. హైదరాబాద్ మహానగరంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని అన్నారు. కొత్త గృహాల కేటాయింపులో దివ్యాంగులు, వృద్ధులు అలాగే వితంతువులు, ఇతర బలహీన వర్గాలు, దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న అర్హులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌లోని పాత ప్రభుత్వ గృహ సముదాయాలు, వాంబే హౌసింగ్, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం తదితర పథకాల కింద నిర్మించిన పాత భవనాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. నివాసయోగ్యం కాని భవనాలను వెంటనే ఖాళీ చేయించాలన్నారు. మరమ్మతు చేయదగిన భవనాలను పునరుద్ధరించి, పూర్తిగా శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చివేసి పునర్నిర్మించేందుకు మూడు విభాగాలుగా వర్గీకరించి నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ మాట్లాడుతూ.. పేదలకు శాశ్వత గృహం కల్పించడం సామాజిక న్యాయానికి ప్రతీక అని అన్నారు. ప్రతి పేద కుటుంబానికి పారదర్శకంగా గృహాల పంపిణీ జరుగుతోందన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ, మాజిద్ హుస్సేన్, మినరల్ కార్పొరేషన్ ఛైర్మన్ అనిల్ కుమార్, వాల్మీకి బోయ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ నగేష్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలాతోపాటు రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.