VGన్యూస్: తెలంగాణలో ఆర్యవైశ్య కార్పొరేషన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డా .కాచం సత్యనారాయణ గుప్త అన్నారు. తక్షణమే ఆర్యవైశ్య కార్పొరేషన్ కు రూ.500 కోట్ల నిధులు కేటాయించాలని సోమవారం హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో “సాధన దీక్ష”ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి హాజరయ్యారు. మధుసూదనా చారి దీక్షపరులు కాచం సత్యనారాయణతో పండ్ల రసం తాగించి దీక్ష విరమింప చేశారు.
ఈ సందర్భంగా కాచం సత్యనారాయణ గుప్త మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్పొరేషన్ ఏర్పాటుతో వైశ్యులందరు ఎంతో సంతోషించారని.. కానీ ఈ రెండేళ్ల కాలంలో కార్పొరేషన్ కు నిధులు ఇవ్వకుండా కాలయాపన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జిందా తిలిస్మాత్ మాదిరిగా కార్పొరేషన్ వస్తే అన్నింటికీ పనిచేస్తదని వైశ్యులను భ్రమల్లో ఉంచి కాలం గడుుపుతున్నారన్నారు. రాజకీయంగా వైశ్యులు యాచించే స్థితిలో కాకుండా శాసించే స్థితిలో ఉండాలని పేర్కొన్నారు. చట్టసభల్లో తమ వానిని వినిపించే విధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో వైశ్యులకు 7 కార్పొరేషన్ పదవులు, 11 మున్సిపల్ ఛైర్మన్లు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకొని ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకపోవడం వైశ్య జాతిని అవమానపరచడమే అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని పేద ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం పోరాటం చేసే ఏకైక సంస్థ వైశ్య వికాస వేదిక అని స్పష్టం చేశారు. ప్రభుత్వాలను గొంతెమ్మ కోరికలు కోరడం లేదని మేమెంతో మాకు అంత వాటా దక్కాల్సిందేనని డిమాండ్ చేశారు.
అనంతరం మధుసూదనాచారి మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సు కోసం అనేక రకమైన సేవలు అందిస్తూ, వైశ్య జాతి కోసం చేస్తున్న ఈ సాధన దీక్షకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. వైశ్యులు అడుగుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తప్ప, కార్పొరేషన్ కు నిధులు కేటాయించకుండా పేదలను ఆదుకునేది ఎలా అని ప్రశ్నించారు. వైశ్యులకు కార్పొరేషన్ నిధులతో పాటు రాజ్యాధికారంలో భాగస్వామ్యం, అన్ని రకాల సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ వైశ్యులకు రాజకీయంగా పెద్దపీట వేసి సమచిత స్థానం కల్పించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కె.వి ప్రతాప్, కండె హరి ప్రసాద్, కాచం సుష్మ, కోటగిరి దైవాధీనం, కండె రాంనరేష్, కూర రమేష్, కొత్త రవి గుప్త, కాచం ఏక సాయి, వీరేందర్, రాంబాబు నిఖిల్, రాజుగుప్త, యాద శ్రీనివాస్ గుప్త, మురళీ గుప్త, వేణు, కాచం శేఖర్, గిరి, శ్రీకాంత్, శ్యాం ప్రసాద్, గుండా ప్రభాకర్ గుప్త, తోట పూర్ణచందర్రావు, దివ్వెల పూర్ణచందర్, షీలా రమేష్, నాగ రామచందర్ తదితరులు పాల్గొన్నారు.







