Home తాజా వార్తలు తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం: సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: గడిచిన రెండున్నరేండ్ల ప్రజా పాలనలో తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం (80th Independence Day) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక ముందు కూడా భగవంతుడి ఆశీస్సులు, ప్రజలందరి సహకారంతో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదామని సీఎం పిలుపునిచ్చారు. భవిష్యత్తు తెలంగాణ నిర్మాణాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ రెండున్నరేండ్లలో ప్రజా ప్రభుత్వం సాధించిన ప్రతి విజయంలో ప్రజలు, ఉద్యోగుల భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. నిరుపేదల ఆర్థిక పురోగతికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఒక స్పష్టమైన దార్శనికతతో విధ్వంసమైన తెలంగాణను పకడ్బంధీ ప్రణాళికలతో వికాసంవైపు నడిపించడానికి తీసుకున్న కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సందేశంలో సమగ్రంగా వివరించారు.
“గడిచిన 32 నెలల్లో ప్రజా ప్రభుత్వం సంక్షేమంతో నాలుగు కోట్ల ప్రజలకు భరోసా ఇచ్చింది. అన్ని రంగాల్లో అభివృద్ధిని వేగవంతం చేసింది. సామాజిక న్యాయంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించింది. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సాంకేతికత, నైపుణ్యాలపై బలమైన పునాదులు వేసింది. సాధించిన విజయాల పునాదిపై తెలంగాణను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లే బృహత్తర సంకల్పమే తెలంగాణ రైజింగ్-2047 (TelanganaRising-2047). ఆర్‌బీఐ తాజా గణాంకాల ప్రకారం 2025-26లో మన రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4,18,931. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం దాదాపు 91 శాతం అధికంగా ఉంది. మన ఆర్థిక వ్యవస్థ బలాన్ని చాటిచెప్పే గొప్ప విజయం ఇది” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.