Home తాజా వార్తలు మేడారంలో ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం

మేడారంలో ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం

మేడారంలోని వన దేవతలు సమ్మక్క – సారలమ్మ సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివ్యాంగులు, ఒంటరి, వితంతు మహిళలకు చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా సీఎం సమ్మక్క – సారలమ్మ గద్దెలను దర్శించుకుని, అమ్మవార్లకు తన నిలువెత్తు బంగారం సమర్పించారు. ఆలయం ప్రాంగణంలో మొక్కను నాటారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా గిరిజన పూజారులు డోలు వాయిద్యాలు, గిరిజన సంప్రదాయాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్థానికంగా అర్హులైన దివ్యాంగులకు, ఒంటరి, వితంతు మహిళలకు పింఛన్లను పంపిణీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసే కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. మేడారానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాగునీటి ప్లాంట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. భక్తులకు పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆలయ ప్రాంగణంలో స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మహిళా సంఘాలు చేపడుతున్న కార్యక్రమాలు, వారి ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు.