Home తాజా వార్తలు హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఇంటిగ్రేట్ చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఇంటిగ్రేట్ చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: హైదరాబాద్ మహా నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా సిగ్నల్స్ పనిచేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనలాగ్, మెగా ఇంజనీరింగ్ సంస్థలకు సూచించారు. అనలాగ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్‌మాన్, మెగా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ రెండు సంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో దేశంలో అమలు చేయనున్న ఫిజికల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థపై సమావేశంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఇంటిగ్రేట్ చేయాలని సీఎం సూచించారు. వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో అనుసంధానం చేయాలని చెప్పారు.
ఈ ఫిజికల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థపై అనలాగ్ సంస్థకు, ఎంఈఐఎల్‌కు మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సంస్థలు పరస్పరం అందజేసుకున్నాయి. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సలహాదారు కె.రామకృష్ణారావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.