VGన్యూస్: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక ఎన్నికల జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో పార్టీ తరపున బి.ఎల్.ఏ. (బూత్ లెవల్ ఏజెంట్) లను సమన్వయం చేయడం కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక సమన్వయ, పర్యవేక్షణ కమిటీని ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎస్.ఐ.ఆర్ కార్యక్రమంలో బి.ఎల్.ఏ. ల భాగస్వామ్యాన్ని సమన్వయం చేయడం, వారికి వచ్చే సందేహాలను, సమస్యలను కేంద్ర పార్టీ కార్యాలయం మధ్య సమన్వయం కల్పించడం, ఆయా అంశాలను స్థానిక ఇంఛార్జీలకు తెలియజేసి సాఫీగా పార్టీ తరఫున ఈ కార్యక్రమం కొనసాగించేలా చూడడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతగా ఉంటుందని తెలిపారు. దీంతో పాటు పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కమిటీలో ఎమ్మెల్సీలు ఎల్. రమణ, డాక్టర్ శ్రవణ్ దాసోజు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ జనరల్ సెక్రటరీ భరత్ కుమార్ సోమా, వివిధ కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్ లు మన్నె క్రిషాంక్, వై. సతీష్ రెడ్డి మరియు పార్టీ నేతలు ముజీబుద్దీన్, సుమిత్రా ఆనంద్, రంగినేని అభిలాష్ రావు సభ్యులుగా ఉంటారని కేటీఆర్ ప్రకటించారు.







