Home తాజా వార్తలు జర్మనీలోని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి: మంత్రి వివేక్

జర్మనీలోని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి: మంత్రి వివేక్

VGన్యూస్: విదేశీ ఉద్యోగాలను పొందడంలో భాషా ప్రావీణ్యమే ప్రధాన అడ్డంకిగా మారుతోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. దానిని అధిగమించేందుకు విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని టామ్‌కామ్ (TOMCOM) కార్యాలయంలో జర్మన్ భాషా శిక్షణ పొందుతున్న విద్యార్థులు, అధ్యాపకులతో మంత్రి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జర్మనీలో ఉద్యోగ అవకాశాలను లక్ష్యంగా పెట్టుకున్న యువత కోసం టామ్‌కామ్ ఆధ్వర్యంలో జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జర్మన్ భాష నేర్చుకోవడంలో క్రమశిక్షణ, నిరంతర సాధనే విజయానికి మార్గమని పేర్కొన్నారు. విద్యార్థులు ఒక్క తరగతిని కూడా మిస్ కాకుండా క్రమం తప్పకుండా హాజరై భాషపై పూర్తి పట్టు సాధించాలని సూచించారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో శిక్షణ పొందితే ఉన్నత స్థాయి భాషా నైపుణ్యాలను సులభంగా సాధించగలరని పేర్కొన్నారు.
నర్సింగ్, ఇంజినీరింగ్ తదితర రంగాల్లో జర్మనీలో మంచి వేతనాలతో కూడిన ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల మందమర్రిలో ప్రారంభించిన జర్మన్ భాషా శిక్షణ తరగతులకు విశేష స్పందన లభించిందని తెలిపారు. మందమర్రి కేంద్రంలో ఇప్పటికే సుమారు 200 మంది యువత జర్మన్ భాషా కోర్సులో చేరినట్లు వెల్లడించారు. ఇటువంటి భాషా శిక్షణ కార్యక్రమాలు యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో విజయవంతమైన కెరీర్ నిర్మాణానికి దోహదపడతాయని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు.