VGన్యూస్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మంగళవారం హైదరాబాద్ శిల్పకళా వేదికగా జరిగిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంప్యూటర్ మీట నొక్కి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ.. వచ్చే 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లను విడుదల చేయాలన్న సంకల్పంతో తొలి విడతగా 41.37 లక్షల రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయడానికి వీలుగా రూ. 2,482.02 కోట్లను విడుదల చేశాం. రాష్ట్రానికి సంబంధించి గడిచిన 30 నెలలుగా సమాజంలో గౌరవం పెంచుకుంటూ విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించుకుంటూ వెళుతున్నాం. వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ప్రజా ప్రభుత్వ లక్ష్యం మేరకు ఆ రంగానికి ఇప్పటివరకు 1.75 లక్షల కోట్లను ఖర్చు చేశాం. ఎల్ నినో ప్రభావం కారణంగా ఈసారి వర్షాలు పడవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే పంట మార్పిడి చేయాలని చెబుతున్నాం. రైతుల కష్టాలేంటో తెలిసిన వాళ్లం. అందుకే అప్రమత్తంగా ఉండాలని చెప్పాం. కొందరు దాన్ని కూడా తప్పుబడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్ తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.







