VGన్యూస్: ధరణి, భూ భారతి పోర్టళ్లలో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ తెలిపారు. ఈ అంశంపై బుధవారం సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. ధరణి పోర్టల్‌పై కొనసాగుతున్న ఫోరెన్సిక్ ఆడిట్ పురోగతిపై జరిగిన సమీక్షలో కొన్ని ఆందోళనకర అంశాలు మంత్రి దృష్టికి తీసుకువచ్చినట్లు లోకేష్ కుమార్ తెలిపారు. ధరణి పోర్టల్ సిస్టమ్ నిర్మాణంలో సహజసిద్ధమైన భద్రతా లోపాలు ఉన్నాయన్నారు. వాటిని దుర్వినియోగం చేసి కొన్ని మాడ్యూళ్ల ద్వారా అనధికారిక ఎంట్రీలు చేసినట్లు గుర్తించినట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో బాధ్యులను గుర్తించడం, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని వెల్లడించారు.
ఈ కమిటీలో సభ్యులుగా:
మిక్కిలినేని మను చౌదరి, ఐఏఎస్ – కలెక్టర్, మేడ్చల్-మల్కాజిగిరి
ప్రతీక్ జైన్ (ప్రతీక్ జైన్), ఐఏఎస్ – కలెక్టర్, సంగారెడ్డి
అనుదీప్ దురిశెట్టి, ఐఏఎస్ – సంయుక్త కార్యదర్శి, ఐటీ & కమ్యూనికేషన్స్ శాఖ
హర్ష వర్ధన్, ఐపీఎస్ – తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో
అపూర్వ్ చౌహాన్, ఐఏఎస్ – ప్రాజెక్ట్ డైరెక్టర్, సీఎంఆర్ఓ
మంద మకరంద్, ఐఏఎస్ – ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐటీడీఏ, ఉట్నూర్
ఏ. సంపత్ – డీఎస్పీ, తెలంగాణ సీఐబీ, సైబర్ క్రైమ్స్
ఎం. సుభాషిణి – డీఐజీ, రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ శాఖ
ఏ. శ్రీనివాస సుబ్బారావు – సీనియర్ డైరెక్టర్ (ఐటీ), ఎన్ఐసీ
ఈ కమిటీ 15 రోజుల్లోగా ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పించనుందన్నారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని లోకేష్ కుమార్ పేర్కొన్నారు. భూముల రికార్డుల భద్రత, సమగ్రత, పారదర్శకత విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని స్పష్టం చేశారు.







