Home తాజా వార్తలు రైతులను విద్యుత్ ఉత్పత్తిదారులుగా తీర్చిదిద్దాలి: డా. గోపి

రైతులను విద్యుత్ ఉత్పత్తిదారులుగా తీర్చిదిద్దాలి: డా. గోపి

VGన్యూస్: వ్యవసాయ రంగంలో నీటి వినియోగాన్ని, తద్వారా వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు పంటల వైవిధ్యీకరణ, సూక్ష్మ నీటిపారుదల, వ్యవసాయ సౌర విద్యుదీకరణ వంటి చర్యలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డా. బి. గోపి ఐఏఎస్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఇండియా ఎనర్జీ సమ్మిట్ & ఎక్స్‌పో–2026 లో భాగంగా బుధవారం నిర్వహించిన గ్రామీణ భారతదేశానికి విద్యుత్ పునరుత్పాదక ఇంధనం, విశ్వసనీయ విద్యుత్ మరియు సమ్మిళిత అభివృద్ధి అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో డా. బి. గోపి ఐఏఎస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గోపి ఐఏఎస్ మాట్లాడుతూ.. వివిధ పంటలకు నీటి అవసరం భిన్నంగా ఉంటుందని, తద్వారా నీటిని ఎత్తిపోసేందుకు అవసరమయ్యే విద్యుత్ వినియోగం కూడా పంటను బట్టి మారుతుందని తెలిపారు. ప్రస్తుతం అధికంగా ఒకే రకమైన పంట విధానం (Monocropping Pattern)వైపు వ్యవసాయం సాగుతుండటం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంటల వైవిధ్యీకరణను (Crop Diversification) ప్రధాన ప్రాధాన్యతగా తీసుకుందని తెలిపారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలుగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ముఖ్యంగా ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. తక్కువ నీటి అవసరమున్న, రైతులకు లాభదాయకమైన పంటలను ప్రోత్సహించడం ద్వారా నీటిపై, వ్యవసాయ విద్యుత్‌పై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని వివరించారు.
వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని తగ్గించే దిశగా వ్యవసాయ రంగంలో సౌర విద్యుదీకరణ (Solarisation)ను విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉందని డా. గోపి అన్నారు. రైతులు కేవలం విద్యుత్ వినియోగదారులుగా కాకుండా, భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తిదారులుగా కూడా మారేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా అవసరమైన మూలధన పెట్టుబడికి సహకారం అందించడంతో పాటు, రైతులకు అనుకూలమైన విధానాలను రూపొందించి సమర్థవంతమైన వ్యవస్థను ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOs), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) వంటి సంస్థలను సౌర విద్యుదీకరణ కార్యక్రమంలో భాగస్వాములను చేయడం ద్వారా రైతులే విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని అభివృద్ధి చేయవచ్చని డా. గోపి పేర్కొన్నారు.