VGన్యూస్: హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించడానికి మెట్రో రైలు విస్తరణ ఎంతో అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇస్తే కేంద్రం వాటా లేకుండానే వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీతో మెట్రో రైలు రెండో దశ విస్తరణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మెట్రోను స్వాధీనం చేసుకోవడానికి ఎల్ అండ్ టీకి రూ.13,500 కోట్ల నిధుల కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐఆర్ఎఫ్సీతో అన్ని రకాల ఒప్పందాలు పూర్తయ్యాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కౌంటర్ గ్యారెంటీ కూడా ఇచ్చామని చెప్పారు. ఐఆర్ఎఫ్సీ నుంచి ఈరోజు విడుదల కావలసిన నిధులు విడుదల కాలేదని చెబుతూ దీనికి కారణమేంటని ప్రశ్నించారు.
హైదరాబాద్ అంతర్జాతీయ నగరమని చెప్పుకునే క్రమంలో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో మెట్రో మొదటి దశకు అంకురార్పణ జరిగిందని గుర్తుచేశారు. ఆనాడు ఢిల్లీ మెట్రోను ఆదర్శంగా తీసుకుని అంతకన్నా అద్భుతమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో 2009 లో మెట్రో నిర్మాణానికి టెండర్లను పిలిచారన్నారు. ఆనాటి నుంచి 2020 నాటికి నిర్మాణం పూర్తి చేసినప్పటికీ ఫలక్ నుమా మార్గంలో నిర్మాణం పూర్తి కాలేదని చెప్పారు. చారిత్రక కట్టడాలు ఉన్నాయని, ఇతరత్రా కారణాలను చూపి గౌలిగూడ – ఫలక్ నుమా మార్గం పూర్తి చేయలేదని అన్నారు.
మొదట్లో రూ. 15 వేల కోట్లతో ప్రారంభించిన మెట్రో పూర్తయ్యేనాటికి రూ. 22 వేల కోట్లకు చేరిందన్నారు. ఆ తర్వాత గత ప్రభుత్వంలో పదేండ్ల పాటు మెట్రో విస్తరణపై ఆలోచన చేయలేదన్నారు. ఆరోజుల్లో దేశంలో ఢిల్లీ మెట్రో మొదటి స్థానంలో ఉంటే హైదరాబాద్ మెట్రో రెండో స్థానంలో ఉందన్నారు. విస్తరణ చేయని కారణంగా ఇప్పుడు 9వ స్థానానికి పడిపోయిందని చెప్పారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో జనాభా 1.34 కోట్లకు చేరుకుందని.. ఇలాంటి పరిస్థితుల్లో మెట్రో విస్తరణ తప్పక చేపట్టాలని కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రిని, కేంద్ర ఆర్థిక, పట్టణాభివృద్ధి, రైల్వే శాఖల మంత్రులను కలిసి ఒత్తిడి తెచ్చామని గుర్తుచేశారు.
అన్ని రాష్ట్రాల్లో మెట్రో విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులు సమకూర్చుతున్న నేపథ్యంలో తెలంగాణ విషయంలో ఇలా ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు. హైదరాబాద్లో రెండో దశ మెట్రో విస్తరణకు కేంద్రం 50 శాతం భాగస్వామ్యం తీసుకుంటుందా లేదంటే హెచ్ఎంఆర్ఎల్ తరఫున ప్రభుత్వం చేపట్టడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మరింత జటిలం చేయదలచుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నందునే సమస్యను పరిష్కరించాలని కిషన్ రెడ్డిని కోరుతున్నామని సీఎం అన్నారు.







