Home తాజా వార్తలు విద్యుత్ ఉద్యోగుల డీఏ పెంపు

విద్యుత్ ఉద్యోగుల డీఏ పెంపు

VGన్యూస్: విద్యుత్ ఉద్యోగుల కరువు భత్యం (డీఏ) 1.621 శాతం పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యుత్ రంగ సంస్థల్లో ప‌ని చేస్తున్న మొత్తం 70,804 మంది సిబ్బంది, పెన్షనర్లు ఈ డీఏ పెంపు వ‌ల్ల ప్రయోజనం కలగనుంది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ సౌధ‌లోని జెన్ కో ప్రధాన కార్యాల‌యంలో బుధవారం ఇంధ‌న శాఖ అధికార‌ల స‌మావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి పెంచిన డీఏ అమలులోకి వస్తుందన్నారు. దీనితో విద్యుత్ ఉద్యోగుల డీఏ 17.651% నుంచి 19.272% కి చేరిన‌ట్లు అయింది. ఈ డీఏ పెంపు వ‌ల్ల ప్రభుత్వంపై నెలకు సుమారు రూ. 9.35 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది.
ఈ స‌మావేశంలోనే విద్యుత్ రంగ పనితీరుపై ఉప ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ఈ ఎండాకాలంలో రికార్డు స్థాయిలో గ‌రిష్ట డిమాండ్ ఎదురైనా ఎక్కడా విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయాలు లేకుండా చూసిన అధికారుల‌ను, సిబ్బందిని డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ప్రధానంగా రాబోయో వర్షాకాలంలో ప్రజ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా విద్యుత్ అధికారులు స‌న్నద్ధం కావాలని ఆదేశించారు. ఈదురు గాలులు, భారీ వర్షాల కారణంగా సంభవించే విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలను క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్ కోలు అత్యంత సంసిద్ధంగా ఉండాల‌న్నారు. ప్రధానంగా క్షేత్రస్థాయి అధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయ‌న ఆదేశించారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే, తక్షణమే రంగంలోకి దిగి లోపాలను సరిచేయాలన్నారు. అలాగే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాబోయే దశాబ్ద కాలానికి సమగ్రమైన, దీర్ఘకాలిక విద్యుత్ ప్రణాళికను సిద్ధం చేయాలని విద్యుత్  అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు.