VGన్యూస్: సీపీఐ శాసనసభ్యుడు కూనమనేని సాంబశివ రావు నేతృత్వంలోని ఆపార్టీ ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై సీపీఐ నేతలు కార్మికుల పక్షాన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రైతుల అంశంపై సీఎం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సహకరించనప్పటికీ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని సీపీఐ ప్రతినిధులకు తెలిపారు. కేంద్రం మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదని చెప్పారు. ప్రభుత్వానికి నష్టం వచ్చినా రైతులు ఇబ్బందులు పడొద్దని మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ ఎమ్మెల్సీ సత్యం, నాయకులు చాడ వెంకట్ రెడ్డి, పశ్య పద్మ, ఈ. నరసింహ, బాగం హేమంతరావు, శంకర్, బాల నరసింహ, వీఎస్ బోసుతో పాటు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.







