Home తాజా వార్తలు వర్షాకాల సన్నద్ధతకు టీజీఎస్పీడీసీఎల్ ప్రత్యేక చర్యలు

వర్షాకాల సన్నద్ధతకు టీజీఎస్పీడీసీఎల్ ప్రత్యేక చర్యలు

VGన్యూస్: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్పీడీసీఎల్ (TGSPDCL) వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు ముందస్తు సన్నద్ధత చర్యలను వేగవంతం చేసింది. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని అన్ని ఆపరేషన్ కేంద్రాల్లో విద్యుత్ వ్యవస్థల బలోపేతానికి యుద్ధప్రాతిపదికన ప్రత్యేక చర్యలు చేపడుతోంది. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ ఆదేశాల మేరకు అధికారులు దెబ్బతిన్న, శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్థంభాల పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తున్నారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా అవసరమైన ప్రాంతాల్లో కొత్త విద్యుత్ స్థంభాల ఏర్పాటు, లూజ్ లైన్ల సవరణ, వంగిపోయిన మరియు దెబ్బతిన్న విద్యుత్ స్థంభాల మరమ్మతుల లాంటి పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. అలాగే విద్యుత్ తీగలకు ఆనుకుని పెరిగిన చెట్ల కొమ్మల తొలగింపు (ట్రీ ట్రిమ్మింగ్) కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నారు.
విద్యుత్ అంతరాయాలు, అత్యవసర పరిస్థితులను త్వరితగతిన పరిష్కరించేందుకు 189 ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ERT) వాహనాలను సిద్ధంగా ఉంచారు. కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో “ఫ్యూజ్ ఆఫ్ కాల్ “(FOC) సేవల కోసం 213 ప్రత్యేక బృందాలను నియమించారు.
వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం 1912 టోల్-ఫ్రీ విద్యుత్ హెల్ప్‌లైన్‌ను 24 గంటలూ అందుబాటులో ఉంచారు. ఈ కాల్ సెంటర్ ద్వారా ఒకేసారి 400 కాల్స్ స్వీకరించే సౌకర్యం కల్పించారు. అదేవిధంగా TGSPDCL Citizen App మరియు TGSPDCL వాట్సాప్ నంబర్ 87124 41912 ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ సేవలన్నీ 24×7 అధికారుల పర్యవేక్షణలో కొనసాగనున్నాయి.
ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు వచ్చిన నేపథ్యంలో విద్యుత్ తీగలు లేదా కేబుల్ వైర్లు తెగిపడి కనిపించినప్పుడు ప్రజలు వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదని, వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు లేదా 1912 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని టీజీఎస్పీడీసీఎల్ విజ్ఞప్తి చేసింది.