VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏనాడూ జనసేన పార్టీ కానీ, నేను కానీ వ్యతిరేకం కాదు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసం వద్ద తెలంగాణ రాష్ట్ర జనసేన నాయకులతో కలసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు తలుపులు మూసి, సభ్యులను బయటకు నెట్టి తెలంగాణను ప్రకటించడాన్ని మాత్రమే జనసేన పార్టీ తప్పు పట్టిందన్నారు. సుమారు 1200 మంది బలిదానాలకు ఇవ్వాల్సిన మర్యాద అదా అని ప్రశ్నించారు. సగటు తెలంగాణ పోరాటయోధులు ఇన్నేళ్లు కష్టపడ్డారనే ఆవేదనతోనే నేను 11 రోజులు అన్నం మానేశాను అని తెలిపారు.
ఇక నుంచి తెలంగాణలో జనసేన పార్టీ రాజకీయంగా పోరాడుతుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. స్వయంగా తెలంగాణ కదనరంగంలోకి తానే దిగుతానని, ప్రజల మధ్య తిరుగుతాని అన్నారు. ప్రజల సమస్యల మీద, ఆకాంక్షల సాధనకు జనసేన పార్టీ బలమైన పోరాటం చేస్తుందని తెలిపారు. వచ్చే హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలతో పాటు, వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీ చేస్తుందని చెప్పారు. పొత్తులతో ముందుకు వెళ్తామా..? ఒంటరిగా వెళ్తామా అనేది కాలం నిర్ణయిస్తుందన్నారు. ప్రతి సమస్య మీదా మాట్లాడతాం.. ప్రతి అన్యాయాన్నీ ఎదుర్కొంటాం అన్నారు.
తెలంగాణ మీ అయ్య జాగీరా..?
ప్రతిసారీ పవన్ కళ్యాణ్ ను తెలంగాణ రానివ్వం.. తెలంగాణలో తిరగనివ్వం అంటుంటారు. తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా..? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నా తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వద్ద అనని విషయాన్ని, జరగని విషయాన్ని కూడా ఓ విశ్లేషకుడు చెప్పారని, దాన్ని తప్పు అని చెప్పకూడదు అంటే ఎలా..? మీరు ఏం చేసినా మేం బాంచన్ దొర అనాలని మీరు భావిస్తే, బెదిరిస్తే మేం భయపడే వాళ్లం కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
తెలంగాణ మీద ప్రత్యేకంగా నేను ప్రేమను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.ఈ గడ్డమీదనే జనసేన పార్టీ పుట్టిందన్నారు. తెలంగాణ మీద ప్రేమ లేకుంటే టీటీడీ నుంచి రూ.30 కోట్లు కొండగట్టు ఆలయ అభివృద్ధికి తీసుకొస్తానా..? విపత్తుల వేళ రూ.కోటి విరాళం తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తానా..? అని ప్రశ్నించారు. తెలంగాణ అన్ని రంగాల్లో ముందుండాలి.. ఇక్కడి ప్రజానీకం సంతోషంగా ఉండాలి.. రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకునేవాడిని అని తెలిపారు.
నాయకులు తప్పు చేస్తే నాయకులను అనాలి. కానీ.. ప్రతిసారి ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందామనే రాజకీయాలు పోవాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రం విడిపోయి పుష్కరకాలం అవుతున్నా, ఉద్యోగాలు రాకపోవడానికి, పరిశ్రమలు లేకపోవడానికి ఆంధ్రోళ్లు కారణం అనడం సబబు కాదు అని పేర్కొన్నారు.
కబ్జా అని తేలితే ప్రభుత్వానికి అప్పగిస్తా:
కోడి చెరువు కబ్జా చేశానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలుపెట్టారని ఏపీ డిప్యీటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అక్కడ ఎలాంటి తప్పు జరిగినట్లు ప్రభుత్వం తేల్చినా ఆ భూమిని తీసుకోవచ్చు.. నాకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అక్కడ గోశాల మాత్రమే ఉందన్నారు










