VGన్యూస్: బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై తాను చెప్పిన లెక్కలు తప్పని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమనే మాటకు కట్టుబడి ఉన్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు పునరుద్ఘాటించారు. దమ్ముంటే తాను చెబుతున్న లెక్కలు తప్పని తన తండ్రి కేసీఆర్‌తో కేటీఆర్ చెప్పించాలని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణలు నిరాధారమని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు సమాధానంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గన్‌పార్కు అమరవీరుల స్థూపం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. 2014 జూన్ 2న రాష్ట్ర ఏర్పాటు సమయంలో మొత్తం బకాయిలు రూ.90,161 కోట్లు మాత్రమే ఉండగా, 2023 డిసెంబర్ 1 నాటికి అవి భారీగా పెరిగాయని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఎఫ్ఆర్బీఎం రుణాలు రూ.72,658 కోట్లు ఉండగా, 2023 డిసెంబర్ నాటికి రూ.3,89,673 కోట్లకు చేరాయన్నారు. ప్రభుత్వ హామీతో ప్రత్యేక ప్రయోజన సంస్థలు (SPVs) తీసుకుని, ప్రభుత్వం చెల్లించాల్సిన రుణాలు రూ.11,609 కోట్ల నుంచి రూ.1,27,208 కోట్లకు పెరిగాయని వెల్లడించారు. ఈ రెండు కలిపి ప్రభుత్వ ప్రత్యక్ష బాధ్యతగా ఉన్న అప్పులు రూ.84,268 కోట్ల నుంచి రూ.5,16,881 కోట్లకు చేరాయని వివరించారు. ప్రభుత్వ హామీతో ఎస్పీవీలు తీసుకుని, వాటినే చెల్లించే రుణాలు రూ.5,893 కోట్ల నుంచి రూ.95,462 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు.
కార్పొరేషన్లు తీసుకున్న ప్రభుత్వేతర హామీ రుణాలు రూ.59,414 కోట్లు ఉన్నాయని మంత్రి మీడియాకు వెల్లడించారు. దీంతో మొత్తం రాష్ట్ర అప్పులు రూ.6,71,757 కోట్లకు చేరాయన్నారు. అప్పులతో పాటు పెండింగ్ బిల్లుల భారం కూడా భారీగానే ఉందని మంత్రి తెలిపారు. ఉద్యోగులు, మూలధన పనులు, సంక్షేమ పథకాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రూ.40,154 కోట్లు, డిస్కంల విద్యుత్ బకాయిలు, సింగరేణి విద్యుత్ బకాయిలు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ బకాయిలు తదితర ఇతర పెండింగ్ చెల్లింపులు రూ.1,09,740 కోట్లు ఉన్నాయని చెప్పారు. మొత్తంగా అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపి రాష్ట్రంపై రూ.8,21,651 కోట్ల ఆర్థిక భారం మిగిలిందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.







