Home తాజా వార్తలు నిరుద్యోగుల తరఫున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం: కేటీఆర్

నిరుద్యోగుల తరఫున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం: కేటీఆర్

VGన్యూస్: తెలంగాణ యువతను కాంగ్రెస్, బీజేపీ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్(KTR) మాట్లాడుతూ.. “ఎన్నికల ముందు డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ మోసం చేసింది. చట్ట సభల్లో పెట్టిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్(Job Calendar) కూడా దిక్కు లేదు. రాష్ట్రంలో నిరుద్యోగులు నిర్వేదంలో ఉన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇలాకాలో ఒక నిరుద్యోగ యువకుడు లేఖ రాసి ఆత్మహత్యయత్నం చేశాడు. కాంగ్రెస్ హామీ ఏమైందని యువకుడు ప్రశ్నించాడు. తెలంగాణ పిల్లలు ఇక్కడ ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నాడు? ఆ పిల్లాడి సూసైడ్ నోట్ చూస్తే బాధ కలిగింది. నిరుద్యోగులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని నా ప్రార్థన. నిరుద్యోగులు దయచేసి బలవన్మరణాలకు పాల్పడవద్దు. మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు భర్తీ చేస్తామని” కేటీఆర్ అన్నారు.
నిరుద్యోగులను ఎండ్రిన్ తాగి చావండని.. ఇంజినీర్లు క్రిమినల్ వేస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి అంటే తామందరం బాధపడ్డామని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో ఫ్లై ఓవర్లు కట్టింది ఇంజనీర్లు కాదా?.. ఎల్లంపల్లి నుంచి రివర్స్ పంపింగ్ చేస్తున్నది ఇంజనీర్లు కాదా?.. కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం కట్టింది ఇంజనీర్లు కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. నిరుద్యోగుల తరఫున సీఎం రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తారని ప్రశ్నిస్తున్నామన్నారు. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నడపాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల తరఫున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.