Home తాజా వార్తలు ఆన్‌లైన్ నుంచి 22-A ఆంక్షలను వెంటనే తొలగించాలి: హరీష్ రావు

ఆన్‌లైన్ నుంచి 22-A ఆంక్షలను వెంటనే తొలగించాలి: హరీష్ రావు

VGన్యూస్: 22-A పేరుతో ఇబ్బందులు పడుతున్న బాధితులెవరూ ఆందోళన చెందవద్దు అని మాజీ మంత్రి,బీఆర్ఎస్ నేత హరీష్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మీకు అన్ని వేళలా అండగా ఉంటుందన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో 22-A నిషేధిత భూముల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. హూడా, హెచ్‌ఎమ్‌డీఏ అప్రూవ్‌డ్ లేఅవుట్లలో, 30 ఏళ్ల క్రితం కొనుక్కున్న ఇళ్లను కూడా ఇప్పుడు 22-A లో పెట్టారంటే.. దీని వెనుక ఎంత పెద్ద కమీషన్ల దందా నడుస్తోందో అర్థమవుతోందన్నారు. యాదాద్రి జిల్లాలో 40 వేల ఎకరాలను 22-Aలో పెట్టారని నాలుగు నెలల క్రితమే స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రికి చెప్పినా రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 10 రోజుల క్రితమేమో ఒక్క ఎకరం కూడా 22-A లో పెట్టలేదు అన్నారు.. నిన్ననేమో అధికారులు పొరపాటు చేశారు సారీ అంటున్నారు.. ఎంత డూప్లికేట్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చిన్న చిన్న విషయాలకే సీఐడీ, విజిలెన్స్ విచారణలు వేసే సీఎం రేవంత్ రెడ్డి.. లక్షలాది మంది జీవితాలతో ఆడుకున్న ఈ 22-A కుంభకోణంపై సీఐడీ ఎంక్వైరీ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ దందాతో సంబంధం లేకపోతే.. తక్షణమే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.                                                        22-A బాధితులకు అన్ని రకాలుగా ఉచిత న్యాయ సహాయం అందించేందుకు తెలంగాణ భవన్‌లో 10 మంది న్యాయవాదులతో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని హరీష్ రావు తెలిపారు. లీగల్ సెల్ సపోర్ట్‌తో పాటు ఎమ్మెల్యేలుగా తాము కూడా అధికారులతో, కలెక్టర్లతో మాట్లాడి సమస్యలు పరిష్కారమయ్యే వరకు మీ వెంటే ఉంటామని భరోసా కల్పించారు. ఎవ్వరూ భయపడి తక్కువ ధరలకు ఆస్తులు అమ్ముకోవద్దని సూచించారు. ఎంతటి పోరాటానికైనా సిద్ధపడి మీ ఆస్తులను రక్షించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని తెలిపారు. ప్రజలను మీసేవలు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిప్పకుండా.. ప్రభుత్వం చేసిన తప్పును ప్రభుత్వమే సుమోటోగా స్వీకరించి ఆన్‌లైన్ నుంచి 22-A ఆంక్షలను వెంటనే తొలగించాలన్నారు. ఒకటి రెండు రోజులు చూస్తాం.. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే బాధితులతో కలిసి పెద్ద ఎత్తున సీఎం ఇల్లు ముట్టడికి సిద్ధమవుతామని హరీష్ రావు హెచ్చరించారు.